ఐపీఎల్ 2026 మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత
_ఇంచార్జ్ సీపీ సుధీర్ బాబు సమీక్ష
– 3 వేల మంది పోలీసులతో బందోబస్తు, 450 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
ఉప్పల్, ఏప్రిల్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ మేరకు ఇంచార్జ్ సీపీ సుధీర్ బాబు (ఐపీఎస్) శుక్రవారం స్టేడియాన్ని సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాచ్‌ల నిర్వహణ కోసం సుమారు 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆక్టోపస్ , స్పెషల్ బ్రాంచ్, క్రైమ్ టీమ్స్ సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. స్టేడియం లోపల మరియు బయట కలిపి మొత్తం 450 సీసీటీవీ కెమెరాలను అమర్చి, వాటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని షీ టీమ్స్‌ను ప్రత్యేకంగా మోహరించనున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తూ, ప్రేక్షకులు నిర్ణీత సమయానికి ముందే స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షకుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా మెట్రో రైలు సర్వీసులను అర్థరాత్రి వరకు నడపాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.అలాగే స్టేడియంలోకి నీళ్ల సీసాలు, తినుబండారాలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంకులు, సిగరెట్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, హెల్మెట్లు, బ్యాగులు, బ్యానర్లు వంటి నిషేధిత వస్తువులను తీసుకురాకూడ
దని స్పష్టం చేశారు.భద్రతా తనిఖీలకు ప్రతి ఒక్కరూ సహకరించి, శాంతియుత వాతావరణంలో క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించాలని సుధీర్ బాబు కోరారు.


Comments