దాహమే తీర్చని చలివేంద్రం
మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల ఆగ్రహం
ఓపెనింగ్ ఫోటోలకే పరిమితమైన చలివేంద్రం
పేరుకే చలివేంద్రం ఆ కుండలో నీటిని నింపని నిర్వాకులు
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ సమయంలో ప్రజల దాహం తీర్చాల్సిన చలివేంద్రాలు… నిర్లక్ష్యానికి గురై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలోని శివునిపల్లి గాంధీ సెంటర్ వద్ద, బరోడా బ్యాంక్ ముందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రస్తుతం పూర్తిగా పనికిరాని స్థితికి చేరింది.
రోజూ వందలాది మంది ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు రాకపోకలు సాగించే ఈ ప్రదేశంలో తాగునీరు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. దాహం తీర్చుకోవాలనే ఆశతో చలివేంద్రం వద్దకు వచ్చిన వారికి ఎదురవుతున్నది మాత్రం ఖాళీ కుండలు, పగిలిన పాత్రలు మాత్రమే.
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, నీటిని నింపకపోవడం, కుండలను సరిచేయకపోవడం మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రోజువారీ కూలీలు ఈ చలివేంద్రంపై ఆధారపడుతుండగా, వారికి నీరు అందకపోవడం వారి ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది.
ఇక బయట తాగునీరు కొనాలంటే ఒక్క బాటిల్‌కే రూ.20 ఖర్చు అవుతుంది. రోజువారీ కూలీలు, నిరుపేదలు అలాంటి ఖర్చు భరించలేని పరిస్థితి. “చలివేంద్రం ఉంది కదా” అనే నమ్మకంతో అక్కడికి వస్తే… నీరు లేకుండా వట్టి కుండలే కనిపించడం ప్రజలను మరింత నిరాశకు గురిచేస్తోంది.


చలివేంద్రం ఏర్పాటు చేసి వదిలేయడమేనా?
రోజూ నీళ్లు నింపే బాధ్యత ఎవరిది?
పర్యవేక్షణ ఎందుకు లేదు?
అనే ప్రశ్నలు స్థానిక ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి.
*పేరుకు మాత్రమే చలివేంద్రం – ఫోటోలకే పరిమితం:*
ప్రస్తుతం ఈ చలివేంద్రం కేవలం ఫోటోలకే పరిమితమైందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, కేవలం ప్రదర్శన కోసం ఏర్పాటు చేసినట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
*తక్షణ చర్యలు అవసరం:*
వేసవి తీవ్రత దృష్ట్యా వెంటనే చలివేంద్రాన్ని పునరుద్ధరించి, ప్రతిరోజూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యత వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి నిర్లక్ష్యం మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
*ఇంకా స్పందించకపోతే…*
ప్రజల ప్రాణాలకు సంబంధం ఉన్న ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ మేల్కొని, ప్రజల దాహం తీర్చే విధంగా చలివేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.


Comments