ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని సిఐటియు డిమాండ్
కేంద్ర ప్రభుత్వం వివక్షత తగదు అధికారుల వేధింపులు ఆపాలని హెచ్చరిక
కాప్రా, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల వివక్షత చూపుతోందని సిఐటియు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎ.అశోక్ విమర్శించారు. కరోనాకాలంలో ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన ఆశా వర్కర్ల సేవలను డబ్ల్యూహెచ్ఓతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాలుగో మహాసభ శనివారం కాప్రా కమలనగర్‌లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎ.హేమలత జెండా ఎగురవేసి మహాసభను ప్రారంభించారు.ప్రారంభ సభలో మాట్లాడుతూ సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎ.అశోక్ –“ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలి. ఉద్యోగ భద్రత, మెరుగైన పని సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రూ.18,000 వేతనం అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు.సిఐటియు జిల్లా కార్యదర్శి జె.చంద్రశేఖర్ మాట్లాడుతూ –“ఆశా వర్కర్లపై అధికారుల వేధింపులు తక్షణమే ఆపాలి. ఎవరు వేధించినా వారిని నిలదీస్తాం, సిఐటియు చూసి ఊరుకోదు”అని హెచ్చరించారు.జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణ మాట్లాడుతూ –“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చిన 50 లక్షల ప్రమాద బీమాకు జీవో విడుదల చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంత్యక్రియల ఖర్చు, ప్రమాద బీమా వంటి సదుపాయాలు వెంటనే అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు.జిల్లా కార్యదర్శి రేవతి కళ్యాణి మాట్లాడుతూ –“సిఐటియు పోరాటాల వల్లే ఆశా వర్కర్లకు గుర్తింపు వచ్చింది. వేతనం లేని స్థితి నుంచి రూ.9,900 వరకు పెంచడం మా ఉద్యమాల ఫలితం. ఇకనైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలి” అని తెలిపారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి వినోద, అంగన్వాడి జిల్లా కార్యదర్శి శోభరాణి ఆశా వర్కర్లకు సంఘీభావం తెలిపారు.వినోద మాట్లాడుతూ – “ఆశా, అంగన్వాడి, మిడ్‌డే మీల్ వర్కర్లు ప్రజల ఆరోగ్యం, పిల్లల సంక్షేమానికి వెన్నెముకలు. కానీ ప్రభుత్వాలు వారి శ్రమకు తగిన గౌరవం ఇవ్వడం లేదు. కనీస వేతనం తక్షణమే అమలు చేయాలి” అన్నారు.
శోభరాణి మాట్లాడుతూ – “ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఆశా వర్కర్ల భుజాలపై నడుస్తోంది. వారికి స్థిరమైన వేతనం, పెన్షన్, ప్రమాద బీమా వంటి సదుపాయాలు ఇవ్వాలి”అని పేర్కొన్నారు.మహాసభ తుది తీర్మానంగా –కనీస వేతనం రూ.26,000 అమలు, ఉద్యోగ భద్రత, ప్రమోషన్‌లు, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తామని యూనియన్ ప్రకటించింది
.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.శ్రీనివాస్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాధ, వసంతి, కోమామలత తదితరులు పాల్గొన్నారు.


Comments