భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు
15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు
-ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించిన ప్రభుత్వం
-లోతట్టు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించాలని సూచనలు
-అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉదయం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
వాతావరణ శాఖ అందించిన నివేదిక ప్రకారం 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయని తెలిపారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని పరిశీలిస్తూ నీటి విడుదలపై కలెక్టర్లకు సమయానుకూల సమాచారం అందించాల్సిందిగా చెప్పారు. నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, వాటి వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, క్రిమికీటకాలు పెరగడం ద్వారా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రత పనులు చేపట్టాలని చెప్పారు.
వైద్యారోగ్య శాఖ తగినంత మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


Comments