ఉప్పల్ జెడ్పిహెచ్ఎస్‌లో డిగ్రీ కళాశాల సమస్యలపై కలెక్టర్ మను చౌదరి సమీక్ష
మేడ్చల్ మల్కాజ్గిరి, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో నడుస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రిన్సిపల్ వివరించగా, మొత్తం 450 మంది విద్యార్థులు కేవలం ఐదు గదుల్లో రెండు పూటలా క్లాసులు వినాల్సి వస్తుండటం తీవ్ర అసౌకర్యంగా ఉందని తెలిపారు. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇంజనీరింగ్ శాఖతో భౌతిక పరిశీలన చేయించి అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కళాశాల తరఫున అదనపు బాత్రూముల అవసరాన్ని కూడా ప్రిన్సిపల్ వెల్లడించగా, వాటి నిర్మాణాన్ని పరిశీలించి త్వరితగతిన ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ హెడ్మాస్టర్ పాఠశాలకు అదనపు గదులు, డైనింగ్ హాల్ అవసరం ఉందని కోరగా, ప్రతిపాదనలు పంపితే పరిశీలించి మంజూరు చేస్తామని కలెక్టర్ సూచించారు.సందర్శన సందర్భంగా కాలేజ్ వాచ్మెన్ తనకు జీతం సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిపత్రం అందజేయగా, కలెక్టర్ వెంటనే సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్, ఫ్యాకల్టీ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు


Comments