అబద్ధాల పునాదులపై ఉన్న కాంగ్రెస్ కూలడం ఖాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం
— గట్టు యాదవ్ జిల్లా అధ్యక్షులు
వనపర్తి,డిసెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని, ఆచరణకు అసాధ్యమైన 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వాటిని అమలు చేయడంలో విఫలమై ప్రజల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిశ్శబ్ద విప్లవం ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు మద్దతు తెలిపారని చెప్పారు. ఈ ఫలితాలను తట్టుకోలేని కొంతమంది ఎమ్మెల్యేలు అసహనంతో ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 59 మంది సర్పంచులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రేవంత్ రెడ్డిది ప్రచార ఆర్భాటమే
— వాకిటి శ్రీధర్, జిల్లా అధికార ప్రతినిధి
ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందాల పోటీలు, తెలంగాణ సమ్మిట్, ఢిల్లీ పర్యటనలు, ప్రజాపాలన ప్రచారం, ఫుట్‌బాల్ స్టేడియం వంటి కార్యక్రమాలకు సుమారు మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి సంక్షేమ పథకాలను బంద్ పెట్టారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 135 గ్రామ పంచాయతీలలో 122 పంచాయతీలు గెలిచి ప్రజల హృదయాల్లో నిలిచామని, రేవంత్ పాలన వైఫల్యం కారణంగానే ఇప్పుడు 50 శాతానికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలు కేసీఆర్ సుస్థిర పాలనను, నిరంజన్ రెడ్డి ప్రజాపాలనను కోరుకుంటున్నారని అన్నారు.
క్యాంపు కార్యాలయం అబ్బ సొత్తు కాదు
— కృష్ణా నాయక్, మాజీ ఎంపీపీ
మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్ని అరాచకాలు, ప్రలోభాలు, దౌర్జన్యాలకు పాల్పడినా ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలబడి 59 మంది సర్పంచులను గెలిపించారని అన్నారు. నిరంజన్ రెడ్డి నిర్మించిన క్యాంపు కార్యాలయంలో ఉంటూ బీఆర్‌ఎస్ సర్పంచులను గేటు తొక్కనీయమని మాట్లాడటం అహంకారమని, అలాంటి తీరుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఘనపురం మండలానికి తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యాభరోసా, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి హామీలు అమలు చేసిన తర్వాతే మాట్లాడాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఎమ్మెల్యే ఏమి చేయలేదని, మిగిలిన మూడేళ్లలో కూడా చేయలేరని ప్రజలు గుర్తించారని, ఇప్పటికైనా ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.ఈ సమావేశంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రి స్వామి, నాయకులు రాళ్ల కృష్ణయ్య, ఎద్దుల సాయి కుమార్, స్టార్ రహీమ్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments