ప్రజా ర్యాలీతో ప్రారంభమయ్యే దళిత ఉద్యమ వేడుకలు.
జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్
ఎల్కతుర్తి, ఏప్రిల్ 16( తెలంగాణ ముచ్చట్లు):
దళిత హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర రెండవ మహాసభలు వరంగల్ పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్ తెలిపారు. ఈ మహాసభలు ఏప్రిల్ 17, 18 తేదీలలో అప్నాస్ ఫంక్షన్ హాల్‌లో జరుగనున్నాయి.
ఏప్రిల్ 17న ఉదయం 10:30 గంటలకు ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ నుండి వందలాది మంది కార్యకర్తలతో భారీ ప్రజా ర్యాలీ ప్రారంభమై, 11:30 గంటలకు పోచమ్మ మైదానంలోని అప్నాస్ ఫంక్షన్ హాల్ వద్ద బహిరంగ సభ నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దళిత నాయకులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు పాల్గొని దళితుల సమస్యలు, హక్కుల సాధనపై చర్చించనున్నారు.
రెండో రోజు జరిగే సమావేశాల్లో దళితులపై జరుగుతున్న అన్యాయాలు, వివక్ష, భూమి సమస్యలు, విద్యా, ఉపాధి అవకాశాలపై సమగ్ర చర్చలు జరిపి, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ మహాసభల ద్వారా దళిత హక్కుల సాధనకు బలమైన ఉద్యమాన్ని నిర్మించడమే లక్ష్యమని, జిల్లా నలుమూలల నుండి దళిత సామాజిక వర్గాల ప్రజలు, యువత, మేధావులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిమ్మల మనోహర్ కోరారు.
కార్యక్రమం నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, వసతి, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు సమకూర్చినట్లు తెలిపారు. ఈ మహాసభలు దళిత ఉద్యమానికి మరింత దిశానిర్దేశం చేస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments