అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
విద్య ఫౌండేషన్ వార్షికోత్సవంలో ఎంపీ కడియం కావ్య
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):
లష్కర్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ వార్షికోత్సవ వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు, సామాజిక వేత్తలకు పురస్కారాలు అందజేశారు.ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత దేశ అభివృద్ధికి మూలస్తంభమని తెలిపారు. బాలికలు విద్యతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని, మహిళ బలపడితేనే కుటుంబం, సమాజం, దేశం బలపడుతుందని స్పష్టం చేశారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సమర్థంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను దేశానికి అందించిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలు దేశవ్యాప్తంగా విస్తరించి ప్రజల్లో చైతన్యం పెంచాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ, సామాజిక విభజనకు దారి తీసే విధానాలు అమలవుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గాల హక్కులను పరిమితం చేసే చర్యలు, మత స్వేచ్ఛపై ఆంక్షలు విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మత మార్పిడి చేసుకునే ఎస్సీల హక్కులను కుదించే విధానాలు రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు.
మహిళా బిల్లులపై స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని, మహిళల హక్కుల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ట్రాన్స్‌జెండర్ హక్కుల విషయంలో కూడా వివక్షత కొనసాగుతోందని అన్నారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిమితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సమాజ సేవా భావనను అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు,
విద్య ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Comments