యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
కాప్రా, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని సాయి నగర్, పద్మశాలి టౌన్‌షిప్ ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని చదువుతో పాటు సమాజ సేవలో ముందుండాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లభిస్తున్న రిజర్వేషన్లు అంబేద్కర్ దూరదృష్టి ఫలితమని పేర్కొన్నారు.
దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘం మేడ్చల్ జిల్లా కోశాధికారి బర్ల భిక్షపతి ముదిరాజ్ అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జోగరావు, సాయి నగర్ కాలనీ అధ్యక్షుడు రాజు, నవీన్ గౌడ్, గజేందర్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
*మీర్పేట్ హెచ్ బి కాలనీ*
మాల మిత్ర సంఘం ఆధ్వర్యంలో మీర్పేట్ హెచ్ బి కాలనీ మదర్ డెయిరీ పార్క్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ప్రసంగాలు చేపట్టారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ఈసిల్ చౌరస్తాలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు ఘటించారు.ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ శాఖ అధికారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ పాల్గొన్న వారితో రోడ్డు భద్రత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమం లో మహా మాల మిత్ర సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షుడు నరేందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాశ్, ఖజాంచి జగదీశ్వర్ రావు, సలహాదారు శ్రీనివాస్ జెతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేందర్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం, సోదరభావం పెంపొందించేందుకు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.


Comments