మేడ్చల్ జిల్లా లో మహిళా సంఘాలకు రూ. 2.33 కోట్లు వడ్డీ లేని రుణాల పంపిణీ
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములను చేయడమే కాకుండా, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.
శామీర్‌పేట్ మండలం ఆదిలాబాద్‌లోని శుభం కన్వెన్షన్ హాల్లో మంగళవారం మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన 3120 మహిళా సంఘాల సభ్యులకు రూ. 2 కోట్ల 33 లక్షల వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఐ కమిషన్ సభ్యులు జైపాల్ రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు అజేయ లక్ష్మి తదితరులు హాజరయ్యారు.చీఫ్ విప్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకోసం ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేశామని తెలిపారు. మహిళలు రాజకీయ రంగంలో కూడా ముందుకు రావాలని ప్రభుత్వ సహాయం పూర్తిగా అందుబాటులో ఉందన్నారు.ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం పురోగమిస్తుందని, గృహ బాధ్యతలతో పాటు ఆర్థిక వ్యవస్థలో కూడా మహిళలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. మహిళలు నిరంతరం కష్టపడి పనిచేసే సైనికులని అభివర్ణించారు.
జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రణాళికలో మహిళలే కేంద్రబిందువుగా ఉంటారని, మహిళా సంఘాలు చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దేశాధ్యక్షులుగా, కంపెనీల సీఈవోలుగా మహిళలు ఎదుగుతున్న ఉదాహరణలను ప్రస్తావిస్తూ, మహిళలు తమ ఉత్పత్తులకు నాణ్యత పెంచి గ్లోబల్ మార్కెట్లలో పోటీపడాలని సూచించారు.
కార్యక్రమంలో ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, తహసీల్దారు, డిఆర్డిఓ సాంబశివరావు, మహిళా సంఘాల సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రారంభంలో తెలంగాణ సాంస్కృతిక సారధుల పాటలు కార్యక్రమాన్ని మరింత రంజింపజేశాయి.


Comments