ఆశా వర్కర్లతో ఆన్లైన్ పనులు చేయించొద్దు – సిఐటియు ధర్నా
కుషాయిగూడ, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఆశా వర్కర్లపై అనవసరమైన పనిభారం మోపడం ఆపాలని, వారికి కనీస వేతనం రూ.18,000 చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి డిమాండ్ చేశారు. కుషాయిగూడ పీహెచ్‌సీ వద్ద సోమవారం ఆశా వర్కర్లు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవతి కళ్యాణి మాట్లాడుతూ –ప్రస్తుతం మాతా, శిశు ఆరోగ్యం కోసం నియమించిన ఆశాలతో బీపీ చెక్ చేయడం, బ్లడ్ టెస్టులు చేయించడం, ఆన్లైన్ మెడిసిన్ ఇవ్వడం వంటి అదనపు పనులు చేయిస్తున్నారని తెలిపారు. అధికారులు ట్యాబ్స్, ఫోన్లు, నెట్ సదుపాయం ఇవ్వకుండానే ఆన్లైన్ పనులు చేయించాలని బలవంతం చేస్తున్నారని, పనులు చేయని పక్షంలో విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు.అలాగే ఎల్సిడిసి సర్వే అమౌంటు, హెచ్‌బిఎన్‌సి, హెచ్‌బివైసి, ఎల్డర్లి కేర్ ట్రైనింగ్ ఇన్సెంటివ్, అడల్ట్ బిసిజి సర్వే ఇన్సెంటివ్ వంటి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"డిగ్రీలు చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు చేయాల్సిన పనులను ఆశాలతో చేయించడం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆన్లైన్ పనుల నుండి ఆశా వర్కర్లను విముక్తి చేయాలి" అని రేవతి కళ్యాణి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ పీహెచ్‌సీకి చెందిన అనేకమంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


Comments