సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి వేడుక ఘనంగా.
సత్తుపల్లి, అక్టోబరు 15 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బి గంగారం గ్రామంలో స్వయంప్రతిపత్తి కలిగిన సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భారత రత్న, మిస్సైల్ మనిషి, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి, వ్యవస్థాపకులు దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కలాం దేశానికి రాష్ట్రపతిగా చేసిన సేవలు ప్రతి భారతీయునికి ఆదర్శమని తెలిపారు. విద్యార్థులతో మమేకమై వారిని ప్రోత్సహిస్తూ “కలలు కన్నండి, వాటిని సాధించండి” అనే సందేశంతో ఎల్లప్పుడూ యువతకు స్ఫూర్తినిచ్చారని అన్నారు.
కళాశాల ప్రధానాచార్యురాలు వూటుకూరి శేషరత్నకుమారి మాట్లాడుతూ, ఏ.పి.జె. అబ్దుల్ కలాం (1931 అక్టోబరు 15–2015 జూలై 27) భారత 11వ రాష్ట్రపతిగా, క్షిపణి శాస్త్రవేత్తగా విశేష సేవలు అందించారని తెలిపారు. ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించి, సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతికశాస్త్రం, అనంతరం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థల్లో ఇంజనీరుగా పని చేసి, బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికతల్లో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారని వివరించారు. ప్రజల రాష్ట్రపతిగా కలాం ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ షేక్ యాకూబ్, జాతీయ సేవా పథకం అధికారి బలుసుపాటి సీతారాములు, అన్ని ఇంజనీరింగ్ శాఖల విభాగాధిపతులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


Comments