నిబంధనల మేరకు అర్హత ఉన్న భూభారతి దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రెవెన్యూ అధికారులను ఉద్దేశించి నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన భూభారతి దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చేపడుతున్న రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో భూభారతి దరఖాస్తులు, ఇప్పటివరకు పరిష్కరించిన సంఖ్య, ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, 22(ఏ) కిందకు వచ్చే భూములు, సాదా బైనామా, ఫారెస్ట్, శిఖం, అసైన్డ్ భూములు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లు వివరాలు అందించారు.
మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్లు సాదా బైనామా దరఖాస్తులపై సమాచారం అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, అసైన్డ్ భూములపై పూర్తి స్థాయి వివరాలను తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, తహసీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments