వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం వైఫల్యం
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి రాములు
ఎల్కతుర్తి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రైతు సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి రాములు విమర్శించారు.ప్రస్తుతం వరి కోతలు పూర్తయి దాదాపు 20 రోజులు గడిచినా, ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోసిన ధాన్యాన్ని రైతులు కల్లాల వద్ద నేలపై బస్తాల్లో నిల్వచేసి, పగటిపూట ఆరబెట్టి – రాత్రిళ్లు తిరిగి కుప్పబెట్టే పరిస్థితి నెలకొన్నదని వివరించారు.
వాతావరణం మారిపోవడంతో ఎప్పటికప్పుడు వర్షాలు కురుస్తుండటంతో పంట నష్టపోతుందనే భయాందోళన రైతుల్లో పెరుగుతోందని తెలిపారు. “ప్రతిరోజూ ధాన్యాన్ని రక్షించుకోవడమే రైతులకు పెద్ద సవాలుగా మారింది,” అని రాములు అన్నారు.అదేవిధంగా సన్న రకం ధాన్యాలపై బోనస్ ప్రకటనలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం రైతుల్లో అయోమయాన్ని కలిగించిందని పేర్కొన్నారు. బోనస్‌పై అస్పష్టత కారణంగా కొందరు రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, సన్న రకం బోనస్‌పై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది.


Comments