పెద్ద పెండ్యాలలో దళిత హక్కుల ఉద్యమ మహాసభల పత్రిక ఆవిష్కరణ
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో దళిత హక్కుల ఉద్యమం రెండవ మహాసభల పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి రాజారపు రత్నం అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా నిర్మాణ బాధ్యులు మద్దెల ఎల్లేష్, జిల్లా అధ్యక్షుడు నిమ్మల మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రొంటాల దేవా మాట్లాడారు. వారు మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలు గడిచినా, అట్టడుగు వర్గాలైన దళితుల హక్కులు ఇంకా పూర్తిగా అమలులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం అందించిన సమానత్వ హక్కులు అమలులో లోపం ఉందని, దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని వారు సూచించారు.
తరతరాలుగా దళితులు ఎదుర్కొంటున్న అణిచివేత, వివక్షత, దోపిడీ పరిస్థితుల నుంచి విముక్తి కల్పించేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. దళితుల హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని, వచ్చే ఏడాది జనవరి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రెండవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాలోత్ శంకర్ నాయక్, రాజారపు దేవయ్య, గోకుల రాజయ్య, బొడిగె కమలాకర్, రాసమల్ల దీన, కొత్తపెల్లి బిక్షపతి, ఆకారపు నాగయ్య, జిట్ట కుమార్, అగస్టీన్ రాహుల్, శ్రీనివాస్, హర్ష తదితరులు పాల్గొన్నారు.


Comments