ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను లాభదాయకంగా నడపాలి....
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
-డిమాండ్ కు అనుగుణంగా మెనూ ఏర్పాటు చేయాలి
-కలెక్టరేట్ ఆవరణలో క్యాంటీన్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను లాభదాయకంగా నడపాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం కలెక్టరేట్ లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి పరిశీలించి క్యాంటీన్ లో కూర్చొని టీ త్రాగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, క్యాంటీన్ నిర్వాహకులతో, డిఆర్డిఓతో మాట్లాడుతూ ఇందిరా మహిళా క్యాంటీన్ వద్ద పాత్రలు కడిగేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో కలెక్టరేట్ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం మెనూ ఏర్పాటు చేయాలని, క్యాంటీన్ కు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు అందిస్తున్న సేవలు, భోజనం నాణ్యత, రుచిపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటు లోటుపాట్లు లేకుండా క్యాంటీన్ ను లాభదాయకంగా నడపాలని తెలిపారు. కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు రెండవ అంతస్తులో క్యాంటీన్ ఉన్నట్లు తెలిసే విధంగా కలెక్టరేట్ ఆవరణలో, బస్ స్టాప్ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, క్యాంటీన్ లో బయటి భోజనం అనుమతించరాదని, ఉద్యోగులు తమ వెంట తెచ్చుకున్న భోజనాన్ని వారికి కేటాయించిన భోజనశాలలో కూర్చొని తినే విధంగా సూచించాలన్నారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ సన్యాసయ్య, అదనపు డిఆర్డీవో నూరొవుద్దీన్, అధికారులు, తదితరులు ఉన్నారు.


Comments