చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయిపై దాడిని ఖండించిన స్ఫూర్తి గ్రూప్
ఏ ఎస్ రావు నగర్, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయిపై సెప్టెంబర్ 7వ తేదీన లాయరు చేసిన బూటు దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం కమలానగర్‌లో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు హాజరై మాట్లాడుతూ “చీఫ్ జస్టిస్ గవాయి అట్టడుగు సామాజిక వర్గానికి చెందినవారు. వివక్షలు, అవమానాలను ఎదుర్కొంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా దేశ అత్యున్నత న్యాయపీఠానికి చేరుకున్నారు. దీనిని తట్టుకోలేని మనువాద, సనాతనవాద శక్తులు ఆయనపై నిరంతరం దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఒక లాయరుచీఫ్ జస్టిస్‌పై బూటు విసిరిన ఘటన హేయమైనది. ఇది ప్రజల్లో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే కుట్రలో భాగం మాత్రమే,” అన్నారు.
చీఫ్ జస్టిస్ గవాయి తన పదవిని ఎంతో హుందాతనంగా నిర్వర్తిస్తున్నారని, ఇటువంటి దురాగతాలకు ప్రజలందరూ వ్యతిరేకంగా ఏకకంఠంతో స్వరం వినిపించాలని ఆయన పిలుపు నిచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిని, దానికి తోడ్పడిన శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉదయ భాస్కర్, జి. శివరామకృష్ణ, ఎం. భాస్కర్ రావు, బంగారు నర్సింగ్ రావు తదితరులు ప్రసంగించి చీఫ్ జస్టిస్‌పై దాడిని ఖండించారు.కార్యక్రమంలో ఉమా మహేశ్వరరావు, శోభ, గౌస్య, శ్రీనివాస్, మల్లేష్, నర్సింగరావు, భాస్కర్ రావు, చందన్ రాజు, ఉదయ భాస్కర్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments