ఘట్కేసర్ వద్ద అంతర్రాష్ట్ర మాదకద్రవ్య రాకెట్ భగ్నం
రూ.1.15 కోట్ల హషీష్ నూనె స్వాధీనం
మల్కాజ్గిరి, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల రవాణాపై ఘట్కేసర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మల్కాజిగిరి ప్రత్యేక ఆపరేషన్ల బృందం (ఎస్‌ఓటీ) మరియు ఘట్కేసర్ పోలీసుల సంయుక్త దాడిలో ఒక అంతర్రాష్ట్ర మాదక ద్రవ్య రవాణా రాకెట్‌ను బట్ట బయలు చేశారు.ఈ ఆపరేషన్‌లో పోలీసులు 5.1 కిలోల హషీష్ నూనెను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.15 కోట్లు. ఈ ఘటనలో 17 ఏళ్ల బాలుడు అదుపులోకి తీసుకోబడగా, ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన దేబేంద్ర జోడియా అలియాస్ శ్రీను పరారీలో ఉన్నాడు.పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆ బాలుడు రైతు కుటుంబానికి చెందినవాడు. చిన్న వయసులోనే చదువు మానేసి వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా, ఒడిశాకు చెందిన దేబేంద్ర జోడియా తో పరిచయం ఏర్పడింది. సులభం గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశం తో ఇద్దరూ కలిసి హషీష్ నూనెను హైదరాబాద్ ప్రాంతాలకు రవాణా చేయాలని నిర్ణయించారు.ఈ క్రమంలో ఆ బాలుడు రైలు మార్గంలో నూనెను తీసుకుని ఘట్కేసర్‌కు చేరుకున్నాడు. అనుమానాస్పదంగా కదులుతుండటంతో పోలీసులు తనిఖీ చేయగా, భారీ మోతాదులో హషీష్ నూనె బయటపడింది.ప్రధాన నిందితుడు దేబేంద్ర జోడియా కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.హషీష్ నూనె వినియోగం మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీర్ఘకాల వాడకం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు.మాదకద్రవ్యాల సేకరణ, రవాణా, విక్రయం తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండి, మాదకద్రవ్య రహిత సమాజం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్, ప్రత్యక్ష పర్యవేక్షణలో, పి.వి. పద్మజ, ఐపీఎస్, డిసిపి మల్కాజ్‌గిరి, ఎ. రమణ రెడ్డి డిసిపి, ఎస్ఓటి-ఐ మల్కాజ్‌గిరి &భువనగిరి, ఎన్. నర్సింహ రెడ్డి ఎడిసిపి ఎస్ఓటి-ఐ, సి. అంజయ్య ఎసిపి ఎస్ఓటి-ఐ, కింది ఇన్‌స్పెక్టర్ పి. చంద్ర శేఖర్ రెడ్డి, పి. వాసుదేవ్, ఎస్ఐపి మరియు ఎస్ఓటి, మల్కాజ్‌గిరి జోన్, ఎం. బాలస్వామి, ఇన్‌స్పెక్టర్ ఘట్కేసర్ బృందం దర్యాప్తు ప్రక్రియను నిర్వహించారు


Comments