బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
రాష్ట్రపతిని కలవనున్న రాష్ట్ర ప్రతినిధి బృందం
-బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం రాష్ట్రపతిని కోరనున్న రాష్ట్ర ప్రతినిధి బృందం
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు :
వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రపతి వద్ద విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత మార్చిలో శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన గడువును సూచించడంతో, చట్టబద్ధత కోసం రాష్ట్రపతిని నేరుగా కలవాలనే ఆలోచనపై మంత్రిమండలి ఏకాభిప్రాయానికి వచ్చింది.
ఈ సమావేశం అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి జరిపిన మీడియా సమావేశంలో మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు. బీసీల హక్కుల సాధనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అన్ని రాజకీయ పార్టీలూ ఈ విషయంలో సహకరించాలని మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది.


Comments