గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
మక్తల్, తెలంగాణ ముచ్చట్లు:
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎన్ లింగయ్య సూచించారు. సోమవారం మక్తల్ పట్టణ కేంద్రం లోని ఆజాద్ నగర్, గాంధీ చౌక్, షరీఫా మసీద్, నూర్ మజీద్, జామియా మసీదు దగ్గరలోని గణేష్ మండపంతోపాటు మరి కొన్ని ప్రధాన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను పర్యవేక్షించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం చేసే మినీ ట్యాంక్ బండ్ ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వహకులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. మక్తల్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు పోలీసు శాఖ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి అని తెలిపారు. మండపాల వద్ద అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.సీసీ కెమెరాల ఏర్పాట్లును పరిశీలించారు. సమస్యలు ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు, ఆంక్షలు పాటించాలని, ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. అధికారులకు బందోబస్తు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, ఆజాద్ నగర్ మండపం వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్ ను డీఎస్పీ గారు తనిఖీ నిర్వహించారు. అధికారులు రాత్రి సమయంలో నిరంతరం పాయింట్ బుక్కులు తనిఖీ చేస్తూ మండపాల వద్ద వాలంటీర్సులను ఉండేటట్లు చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments