మధ్యాహ్న భోజన కార్మికులపై నిర్లక్ష్యం..
వేతనాలు, గుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి ఉన్నికృష్ణన్
మేడ్చల్, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
మధ్యాహ్న భోజన పథకం అమల్లో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పట్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నికృష్ణన్ తెలిపారు.గత ఆరు నెలలుగా కార్మికుల వేతనాలు,నిర్వహణ
బిల్లులు, పది నెలల కోడిగుడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు "బిల్లులు క్లియర్‌లో ఉన్నాయి" అంటూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో బిల్లులు జమ చేయాలని డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజనం వండడానికి కట్టెల పొయ్యి వాడొద్దని అధికారులు చెబుతున్నప్పటికీ, గ్యాస్ సిలిండర్లు మాత్రం కార్మికులే కొనాలని చెబుతుండటం అన్యాయమని ఉన్నికృష్ణన్ అన్నారు. “మేము గ్యాస్‌ను వ్యక్తిగత అవసరాలకు కాదు, విద్యార్థుల వంటకానికే వాడుతున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.కొత్త మెనూ విషయంలో కూడా ప్రభుత్వం కార్మికులను ఇబ్బందుల్లోకి నెడుతోందని విమర్శించారు. పాత బడ్జెట్‌తో కొత్త మెనూను వండడం సాధ్యం కాదని, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలను పెంచాలని, గుడ్ల సరఫరా బాధ్యతను ప్రభుత్వం స్వయంగా చేపట్టాలని సూచించారు.


Comments