తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ
ముఖ్యమంత్రిని కలిసిన సంస్థ ప్రతినిధుల బృందం
హైదరాబాద్, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రపంచ ఫార్మా రంగంలో ప్రముఖ స్థానం కలిగిన ఎలి లిల్లీ అండ్ కంపెనీ హైదరాబాద్‌ను
కేంద్రంగా చేసుకొని కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం సంస్థ రూ. 9 వేల కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టనుంది.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం సంస్థ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ అండ్ కో ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్‌తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.సమావేశ అనంతరం సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణలో కార్యకలాపాలను భారీ ఎత్తున విస్తరించనున్నట్టు తెలిపింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంపై విశ్వాసం ఉంచినందుకు సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ దేశంలోనే ఫార్మా హబ్‌గా పేరుపొందిందని, ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 1965లో ఇందిరా గాంధీ ఐడీపీఎల్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఫార్మా రంగం అభివృద్ధి దిశగా పయనమైందని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని వివరించారు.
ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఆధునిక ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు.ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలతో రాష్ట్రంలో వేలాది మంది కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు, ఇంజనీర్లు, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
150 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా ఆధారిత ఎలి లిల్లీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, ఒబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ సంబంధిత వ్యాధులపై నూతన ఔషధాలు, పరిశోధనలలో ముందంజలో ఉంది. ప్రస్తుతం సంస్థ గురుగ్రామ్, బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments