పురస్కారాల పులిపాటి
సామాజిక సేవకుడికి "జీ తెలుగు" అచీవర్స్ అవార్డ్
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందజేత
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 25, తెలంగాణ ముచ్చట్లు;
-ప్రతి కదలిక నిస్వార్థంతో కూడినదే అయితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. పది మందికి సాయపడే మనసే ఉంటే ప్రశంశలు వాన జల్లులా కురుస్తాయి. సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ విశిష్ట సేవలతో నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా "వాగ్దేవి" విశిష్ట సేవా పురస్కారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా "ఉత్తమ విద్యా సంస్థల అవార్డు"ను అందుకున్న ప్రఖ్యాత వ్యక్తి డాక్టర్ పులిపాటి ప్రసాద్ అమ్ముల పొదిలోకి మరో పురస్కారం వచ్చి చేరింది. సేవే శ్వాసగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పులిపాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ న్యూస్ ఛానల్ "జీ తెలుగు" అచీవర్స్ అవార్డును బహుకరించింది. హైద్రాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ కన్వెన్షన్ హాల్ లో బుధవారం సాయంత్రం "జీ తెలుగు" యాజమాన్యం ఈ పురస్కారాన్ని పులిపాటికి ప్రదానం చేసింది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, సినీ దర్శకుడు హరి శంకర్, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి, జీ తెలుగు చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ లు "జీ తెలుగు అచీవర్స్" అవార్డును పులిపాటి ప్రసాద్ కు బహుకరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి, ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీ, రికార్డ్ హోల్డింగ్ మౌంటెనీర్ కళావత్ పూర్ణ పాల్గొన్నారు.*
సేవానిరతికి పురస్కారాలెన్నో.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో డాక్టర్ పులిపాటి ప్రసాద్ తెగువ చూపి ప్రజలకు ఆపన్న హస్తం అందించారు. జిల్లా కోర్టులో న్యాయవాదులతో పాటు వందలాది మంది నిరుపేద ప్రజానీకానికి 10 లక్షలను వెచ్చించి నిత్యావసర వస్తువులు, మందులను పంపిణీ చేశారు. అలాగే తమ నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల్లో చదువుతున్న 72 మంది నిరుపేద పిల్లలకు వారి ఆర్థిక స్థితిని బట్టి 13 లక్షల మేర ఫీజులను తగ్గించడం, మినహాయించడం ద్వారా తల్లిదండ్రుల మన్ననలు పొందారు.
రాజకీయ అరంగేట్రం చేసిన తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న పులిపాటికి కాంగ్రెస్ సర్కారు పదవి కట్టబెట్టడం సాధారణ విషయమేమీ కాదు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో రాష్ట్ర ప్రజల విజ్ఞప్తుల మేరకు మద్యపాన నిషేధాన్ని అమలులోకి తేవాల్సి వచ్చింది. ఇలాంటి గురుతర బాధ్యతను మోసేందుకు వావిలాల గోపాలకృష్ణయ్యను రాష్ట్ర మద్యపాన నిషేధ కమిటీకి చైర్మన్ గా సర్కారు నియమించింది. శ్రీరామమూర్తిని రాష్ట్ర కన్వీనర్ గా ఎంపిక చేయగా ఖమ్మం జిల్లాలో ఈ గురుతర బాధ్యతను మోసే అవకాశం నాడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న పులిపాటి ప్రసాద్ కు దక్కింది. మద్యపాన నిషేధ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించగా పులిపాటి కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టడం నాటి రాజకీయాల్లో సంచలనంగా మారింది.
నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో వినియోగదారుల భద్రతా మండలి రాష్ట్ర డైరెక్టర్గా పని చేసి అత్యుత్తమ ఫలితాలను సాధించిన ఘనత పులిపాటికి దక్కింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీఆర్ ఈ భద్రతా మండలికి చైర్మన్ గా వ్యవహరించగా నూనూగు మీసాల ప్రాయంలో పులిపాటి డైరెక్టర్ గా వ్యవహరించారు. శాసనసభ స్పీకర్ గా పని చేస్తున్న శ్రీపాదరావు యనమల రామకృష్ణుడుని జిల్లాకు రప్పించి వారి ద్వారా వినియోగదారుల సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతిపక్షాలను సైతం ముక్కున వేలేసునేలా చేసిన ఘనత పులిపాటి సొంతం. అప్పటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా జడ్జిలను ఈ మహోన్నత కార్యంలో భాగస్వాములను చేసి ప్రజల్లో వస్తు కొనుగోళ్లు, వినియోగం పట్ల అవగాహన కార్యక్రమాలను ఉవ్వెత్తున నిర్వహించారు.
జన జాగృతి పేరిట ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం పులిపాటి చేసిన కృషికి అద్భుతమైన, అపారమైన గుర్తింపు లభించింది. పులిపాటి ప్రసాద్ చైర్మన్ గా వనజీవి రామయ్య కన్వీనర్ గా జన జాగృతి పరిరక్షణ కమిటీని నియమించగా నాడు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్యతో మూడు దశాబ్దాల కిందటే కలిసి పని చేయడం ఆయన మరిచిపోలేని ఘట్టం. నాడు వనజీవితో కలిసి జిల్లా నలు మూలల్లో ఐదు లక్షల మొక్కలు నాటిన ఘనతకు గుర్తింపుగా "పర్యావరణ పరిరక్షణ విశిష్ట సేవా అవార్డు"ని నాటి ప్రభుత్వం పులిపాటికి బహుకరించించింది. రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ అఫీషియల్ అవార్డును అందుకోవడం చరిత్రాత్మకం.*
పులిపాటి టిడిపిలో ఉన్నప్పటికీ ఆయన విద్యా సేవలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు గొప్ప పురస్కారంతో గౌరవించడం విశేషం. జిల్లా కలెక్టర్ గా నాడు పని చేసిన శశిభూషణ్ కుమార్ చేతుల మీదుగా 2009లో రిపబ్లిక్ డే రోజున "ఉత్తమ ఎడ్యుకేషనలిస్ట్" అవార్డును పులిపాటి అందుకున్నారు.
అలాగే 2019లో నాటి గవర్నర్ తమిళసై చేతుల మీదుగా హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో "మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు"ను ప్రసాద్ దక్కించుకున్నారు. ఆవేదికపై బిజెపి ఎంపీ బంగారు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ఉన్నారు.
2006 సెప్టెంబర్లో నాటి కాంగ్రెస్ డైనమిక్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలోనే "ఉత్తమ విద్యా సంస్థల అవార్డు"ను పులిపాటికి బహుకరించడం సంచలనం రేపింది. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవార్డును బహూకరించడం నిజంగా సంచలనమే మరి.
ఉత్తమ విద్యా సేవలకు గుర్తుగా 2008 మేలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ స్థాయి "వాగ్దేవి విద్యా సంస్థల పురస్కారాన్ని" పులిపాటి అందుకున్నారు.


Comments