రైతుల ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన.!
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి.
సత్తుపల్లి, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం సాగు సీజన్‌లో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, దళారుల దోపిడీని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాటా, రేటు, బస్తాల విషయంలో రైతులకు న్యాయం జరిగేలా పర్యవేక్షణ పెంచాలని కోరారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. అదనంగా ఇందిరమ్మ ఇళ్లు సంబంధిత బిల్లుల సమస్యలు, ఇంకా కట్టని ఇళ్లను లబ్ధిదారుల ఆమోదంతో కొత్త అర్హులైన వారికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే మట్టా రాగమయి విజ్ఞప్తి చేశారు.


Comments