విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
-జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్,తెలంగాణ ముచ్చట్లు:
మెస్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహణపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ కార్యక్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆయా శాఖల అధికారులకు శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పరిశుభ్రమైన త్రాగు నీరు అందించాలని అన్నారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్, కెజిబివి పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లితండ్రులు వస్తున్నారని ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధత అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ,కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారులు, వార్డెన్ లు, ప్రిన్సిపాల్స్ పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ, మోడల్ రెసిడెన్షియల్ , కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాలు 80 విద్యాసంస్థలలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్ గురుకులాలు, హాస్టల్ లలో డైట్, కాస్మోటిక్ చార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈనెల అనగా శనివారం చేపట్టినందున జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పగడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జిల్లాలోని వసతి గృహాల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి భోజనం చేయనున్నారని, ఏర్పాట్లు పండుగ వాతావరణంలో ఉండాలని ఆయన అధికారులను సూచించారు. విద్యార్థులకు కొత్త డైట్ చార్జీల ప్రకారం చికెన్ కర్రీ , బగారా రైస్, మిల్ మేకర్ కుర్మా, సాంబార్, పెరుగు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అన్నారు.


Comments