60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రాచకొండ పోలీసుల భరోసా
వారానికి రెండుసార్లు సందర్శన
మహేశ్వరం, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కెఎస్సీ) ఆధ్వర్యంలో గోల్డెన్ కేర్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి ఐపీఎస్ సూచనలతో, మంగళవారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ సీఐ హెచ్. వెంకటేశ్వర్లు, సెక్టార్ ఎస్సై, పీటర్ మొబైల్ సిబ్బంది కలిసి పీఎస్ పరిధిలో ఒంటరిగా నివసిస్తున్న 60 ఏళ్లు పైబడిన వృద్ధు లను సందర్శించారు.వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు, పండ్లు, అనారోగ్యంతో ఉన్నవారికి ఔషధాలు అందించారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రగ్గులు, స్వెటర్లు కూడా పంపిణీ చేశారు. వారానికి రెండుసార్లు వృద్ధుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యం, బాగోగులు తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలసి సీనియర్ సిటిజన్ల కోసం ‘గోల్డెన్ కేర్ – మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ’ కార్యక్రమాన్ని కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వృద్ధులకు సంరక్షణ, రక్షణ, గౌరవం అందించడమే దీని ప్రధాన లక్ష్యం.సహాయం కోరే వృద్ధులు సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ 14567 లేదా రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా సంప్రదించాలని పోలీసులు సూచించారు.


Comments