కుషాయిగూడలో రాచకొండ పోలీస్ ఉచిత మెగా వైద్య శిబిరం
వృద్ధుల ఆరోగ్యానికి రాచకొండ పోలీసుల ప్రత్యేక శ్రద్ధ
కుషాయిగూడ, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డైరెక్టర్ జనరల్ & రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించామని, అందులో భాగంగానే ఇది మూడో హెల్త్ క్యాంప్‌గా నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. కుషాయిగూడ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్లకు చెందిన వృద్ధులకు ఈ శిబిరం ద్వారా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
పోలీసులు నేరుగా వృద్ధుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోవడంతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన, రోడ్డు భద్రత అంశాలపై కూడా సూచనలు ఇస్తున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు తమ సమస్యలను పోలీసులతో పంచుకునే అవకాశం లభిస్తోందని, అదే సమయంలో వారికి భరోసా కల్పిస్తూ నేర నియంత్రణకు కూడా ఇది దోహదపడుతుందని అన్నారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాల్లో వారికి తగిన సహాయం అందిస్తున్నామని తెలిపారు. సామాజిక సేవా దృక్పథంతోనే రాచకొండ కమిషనరేట్ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు
.


Comments