బహుజనుల తలరాత మార్చేది చదువే
సీఎం రేవంత్ రెడ్డి
-సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు
-కుల గణన ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పించనున్న ప్రభుత్వం
-ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నామన్న హామీ
హైదరాబాద్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
బహుజనులు సమాజంలో నిలదొక్కుకోవాలన్నా, ఎదగాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. బహుజనులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, పాపన్న బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అందుకే సచివాలయం ఎదురుగా ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వందేళ్లుగా ఎదురుచూస్తున్న బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణలో తొలిసారిగా కుల గణన పూర్తి చేశామని చెప్పారు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 95 వేల మంది రెండు నెలలపాటు ఇంటింటికీ తిరిగి సమగ్ర సమాచారం సేకరించారని, ఆ సమాచారాన్ని కంప్యూటరైజ్ చేసి క్రోడీకరించామని వివరించారు. కుల గణనలో ఎక్కడా ఒక్క తప్పూ లేదని, దానిని వక్రీకరించే ప్రయత్నాలు జరిగితే రాబోయే వందేళ్లలోనూ బహుజనులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు.
కుల గణన ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం, విద్యా ఉద్యోగావకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానించిందని, రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించబడి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించబడ్డాయని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చేసిన గత ప్రభుత్వంలోని పంచాయతీ రాజ్ చట్టం అడ్డంకిగా మారిందని, ఆ గరిష్ట పరిమితిని తొలగించే ఆర్డినెన్స్ కూడా జారీ చేశామని వివరించారు. ఈ మూడు అంశాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదానికి పెండింగ్‌లో ఉన్నందున, వాటిని ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఢిల్లీలో ఆందోళన చేసినట్టు చెప్పారు.
దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టపరంగా తావు లేదని, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు, ఆర్డినెన్స్‌లో దానికి సంబంధించిన ఒక్క పదం కూడా లేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెనుకబాటు తనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించామని ఆయన పేర్కొన్నారు. సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో చదువుతోనే బహుజనులు తమ తలరాత మార్చుకోగలరని ఆయన ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారులు కే. కేశవరావు, వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మరియు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు
.


Comments