పేదల ఇంటి కల సాకారం – కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ స్వంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో సీసీ రోడ్లు మరియు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తానేదార్ పల్లి గ్రామాన్ని నమూనా గ్రామంగా ఎంపిక చేసి 91 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ గ్రామంలోనే రూ.4 కోట్ల 55 లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 80 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పారు.
సర్పంచులు, అధికారులు ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి లబ్ధిదారుని వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. మే 31లోపు మొదటి విడత ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, రైతు భరోసా, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి తన ఏకైక లక్ష్యమని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని తెలిపారు. ఘనపూర్ జలాశయం కాలువల మరమ్మత్తులతో ప్రతి గ్రామానికి సాగు నీరు అందుతున్నదని, దాంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. దాదాపు లక్ష ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతోందని వెల్లడించారు.
కొంత మంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తూ, ఎవరెన్ని విమర్శలు చేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, సర్పంచ్ హరిత ఇంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments