పూలే మళ్లీ పుట్టాడా అనే స్థాయిలో బీసీల కోసం జాగృతి ఉద్యమం
పాలకులకు భయం లేదు కాబట్టే మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసీ ఉపకోటా లేదు
బీసీ మహిళలకు ఉప కోటా కోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమిద్దాం
మహత్మా పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
ఆయన ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్,ఏప్రిల్11(తెలంగాణ ముచ్చట్లు):
కేంద్రంలోని బీజేపీ పాలకులకు బీసీలంటే భయం లేకపోవటంతోనే మహిళ రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం జాగృతి ఎంత కమిట్ మెంట్ తో ఉద్యమం చేసిందో బీసీ సబ్ కోటా కోసం అంతే కమిట్ మెంట్ తో పనిచేస్తుందని తేల్చిచెప్పారు. మహత్మా జ్యోతిరావ్ పూలే రెండు వందల జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కల్వకుంట్ల కవితతో పాటు జాగృతి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మహిళ రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా కోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మహత్మా పూలేనే మళ్లీ పుట్టారా అనే స్థాయిలో తమ పోరాటం ఉంటుందన్నారు. దేశంలో మహిళ రిజర్వేషన్ బిల్లు రావటంలో జాగృతి ఉద్యమమే కీలకం అన్న విషయాన్ని మనమంతా సగర్వంగా చెప్పుకోవాలన్నారు. అంతటితో ఆగకుండా బీసీలకు ఉపకోటా వచ్చే వరకు పోరాడుదామన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరగనున్న నేపథ్యంలో అవసరమైతే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. బీసీ కోటా కోసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతామని అన్నారు. అధికార బలం ఉందని బీసీ కోటా లేకుండా బిల్లు పాస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీ కోటా వచ్చే వరకు జాగృతి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పూలే విగ్రహంపై ఎందుకంత నిర్లక్ష్యం?
ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాల్సిన పూలే విగ్రహం విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. అసెంబ్లీ లో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని జాగృతి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరితే ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పూలే జయంతి నాటికి కూడా విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు చేశారే తప్ప పూలే విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదన్నారు. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి రోజు నాటికైనా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పూలే ఆశయాల సాధనే నిజమైన నివాళి
పూలే ఆశయాల సాధన కోసం అహర్నిశలు పనిచేయటమే ఆయనకు నిజమైన నివాళి అని కవిత అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన సరే వెన్ను చూపకుండా పోరాడిన త్యాగధనులు పూలే అని చెప్పారు. ఏ విప్లవం వచ్చిన సరే త్యాగం పునాదిగా ఉంటుందని.. సమాజంలో మార్పు తేవాలంటే ముందు ఆ మార్పు మన నుంచే మొదలుకావాలని సూచించారు. జాగృతి చేపట్టే బాట కూడా ముళ్లబాట మాదిరిగానే ఉంటుందని.. పూలే కి కూడా అదే జరిగిందని గుర్తు చేశారు. ఎన్ని అవమానాలు, కష్టాలు ఎదురైనా నమ్ముకున్న తోవను వదిలిపెట్టని మహానీయుడు పూలే అని కొనియాడారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు కంకణబద్దులైన మనం కూడా పూలే అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఆర్టిజన్లకు జాగృతి మద్దతు
విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్జిజన్లను రెగ్యులర్ చేయాలన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కొత్తగూడెంలో ధర్నా చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. వారికి మద్దతుగా రాష్ట్రంలోని ఆర్టిజన్లంతా కొత్తగూడెంలో చేస్తున్న ధర్నాలో
జాగృతి నాయకులుగా కూడా పాల్గొంటారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్జిజన్ల జీతాలు రూ.40 వేలకు పెంచిందని, ఇందులో తన వంతు ప్రయత్నం చేశానని కవిత గుర్తు చేశారు.


Comments