యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం
_డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
– మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి సూచన
నాచారం, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని కైలాసగిరి కాలనీలో రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పించారు. సరదాగా ప్రారంభమయ్యే అలవాటు క్రమంగా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. యువత మంచి ఆలోచనలతో సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.డ్రగ్స్‌కు అలవాటు పడిన వ్యక్తి తన ప్రవర్తనపై నియంత్రణ కోల్పోతాడని, మత్తులో ప్రమాదకర చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం లేదా విక్రయంపై అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఎస్ఐ సాయిలు, కాలనీ అధ్యక్షులు పంగ యాకోబు, దామర కుమార్, రాందాస్ నాయక్, రుద్రా ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ మరియు వారిబృందం, స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments