జవహర్ నగర్‌లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
_ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని పూలే దంపతుల సేవలను కొనియాడారు
జవహర్ నగర్, ఏప్రిల్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై పూలే విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, సమాజంలో ఉన్న అసమానతలు, వివక్ష, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేద ప్రజలను ఐక్యం చేసి ఉద్యమం నడిపిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. దేశానికి రాజ్యాంగం అందించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు మార్గదర్శకుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి పూలే అని పేర్కొన్నారు.మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళలకు చదువు ఉండకూడదని ఉన్న కాలంలోనే ఆడపిల్లలకు విద్యను అందించి సమాజ మార్పుకు పునాది వేసిన తొలి గురువు సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆమె కృషి వల్లే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని చెప్పారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సావిత్రిబాయి పూలే ఆశయాలకు ప్రతిబింబమని తెలిపారు. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం అభినందనీయమని పేర్కొన్నారు.జవహర్ నగర్‌లో పూలే విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఆశయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు జోగారావు, కమల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి, వేణుగోపాల్, మహిపాల్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments