కార్తీక మాసం సందర్భంగా సత్తుపల్లి డిపో ప్రత్యేక బస్సులు.
అన్నవరం, పంచారామాలకు డీలక్స్ సేవలు.
సత్తుపల్లి, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు.
శనివారం డిపో కార్యాలయంలో మోటార్ వాహన పరిశీలకుడు జె.ఎన్. శ్రీనివాసరావుతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం సునీత మాట్లాడుతూ, కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు సత్తుపల్లి నుండి బస్సులు బయలుదేరి సోమవారం ఉదయం పుణ్యక్షేత్రాలకు చేరుకుంటాయని చెప్పారు.
అన్నవరానికి పెద్దలకు ఛార్జీ రూ.570, పిల్లలకు రూ.330గా (ఒకవైపు) నిర్ణయించినట్లు వివరించారు. పంచారామాలకు పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.770గా నిర్ణయించారని తెలిపారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 4న కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. 30 మంది భక్తులు ఉంటే వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
ప్రయాణికులే దైవమని భావిస్తూ భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక సేవలను అందిస్తున్నామని సునీత తెలిపారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి.ఐ. శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ పి. విజయశ్రీ, మెకానికల్ ఇంజినీర్ ఎస్. సాహితి, సెక్యూరిటీ కానిస్టేబుల్ రాములు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.


Comments