తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి
మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండలో మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఎస్సీ వర్గీకరణ సమస్యపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాల్సిన అవసరముందని సూచించారు.
ఎస్సీ వర్గీకరణ—నిలిచిన ప్రగతి
తాతికొండ రాజయ్య మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై గతంలో తీసుకున్న చర్యలు కోర్టు వ్యవహారాల కారణంగా నిలిచిపోయాయని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై చర్యలు చేపట్టినా, మాల సంఘాలు కోర్టులో కేసు వేయడంతో వర్గీకరణ ఆగిపోయిందని వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వాలపై ఆగ్రహం
తాతికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయడంలో విఫలమైందని, కొత్త కమిషన్ పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. మాదిగలు ఎదుర్కొంటున్న అన్యాయానికి ప్రధాన కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం అని అభిప్రాయపడ్డారు.
కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేసిన రాజయ్య, “1994 నుంచి ఇప్పటివరకు దళితుల హక్కులను దోచుకుంటూ, మాదిగలకు అసలు న్యాయం చేయలేకపోయారు” అన్నారు.రెండోసారి “బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో కూడా మాదిగలు అణచివేతకు గురయ్యారు” అని పేర్కొన్నారు.
బీజేపీ తీరుపైనా విమర్శలు
నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపినప్పటికీ, బీజేపీ ఈ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని,తాత్సారం చేసిందని రాజయ్య ఆరోపించారు. మాల సంఘాలు కూడా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని, మాదిగలకు నష్టం కలిగే చర్యలు చేపడుతున్నాయని ఆయన అన్నారు.
మాదిగల కోసం పోరాటం కొనసాగుతుంది
తాతికొండ రాజయ్య మాట్లాడుతూ, ఇప్పుడు “ఎస్సీ వర్గీకరణకు ఎటువంటి అడ్డంకులు లేవని,మాదిగల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం” అని ప్రకటించారు. “వర్గీకరణ అమలే మా ప్రధాన లక్ష్యం. ఎవరూ మాదిగల హక్కులను అడ్డుకోలేరు” అని పునరుద్ఘాటించారు.
తాతికొండ రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాదిగల హక్కుల కోసం సాగుతున్న ఈ ఉద్యమం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అంశంపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


Comments