పాఠశాల దశలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశంలో నిట్ వరంగల్ విశ్రాంత ఆచార్యులు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశానికి ఇన్చార్జి ధర్మ ప్రకాష్ అధ్యక్షత వహించారు.
లక్ష్మారెడ్డి పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం పై మాట్లాడుతూ, శాస్త్రీయ దృక్పథం అనేది విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం ప్రోత్సహించే మనస్తత్వం అని తెలిపారు. నేటి వేగవంతమైన సాంకేతిక యుగంలో విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించేలా ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ధర్మసాగర్ మండల విద్యాధికారి డాక్టర్ రామ్ దాన్ మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలో శాస్త్రీయ దృక్పథం అలవర్చుకుంటే, విద్యార్థులు తమ నిత్యజీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యల పరిష్కారాలను సృజనాత్మకంగా కనిపెట్టగలుగుతారని, దీంతో వారి భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో ధర్మసాగర్ మండలంలోని వివిధ పాఠశాలల నుండి 38 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్యాంసుందర్, రవీందర్, యమున శ్రీ మూడవ, నాల్గవ తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణిత మోడల్ లెసన్స్ బోధించారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, వాలియా తదితరులు పాల్గొన్నారు.


Comments