ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విచ్చేసే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మరింత శ్రద్ధ వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. శుక్రవారం కాజీపేట మండలంలోని కడిపికొండలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అవుట్ పేషంట్ రిజిష్టర్, మందుల నిల్వ గది, ల్యాబొరేటరీ, కార్యాలయం గది, ఇన్‌పేషంట్ వార్డు సహా పలు విభాగాలను పరిశీలించారు. ఇన్‌పేషంట్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళను కలెక్టర్ పరామర్శించారు.
గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందే పరిస్థితిని గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల సంఖ్య, ఆశా కార్యకర్తల పర్యవేక్షణ, రెగ్యులర్ చెకప్ వివరాలు, ఓపీ నమోదుపై క్లారిటీ కోరారు. అలాగే, ఇ-ఔషధి పోర్టల్‌లో మందుల అవసరాలు ఎలా నమోదు చేస్తున్నారన్న అంశాన్ని సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, పీహెచ్సీ పరిధిలోని గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆశా కార్యకర్తల సమన్వయంతో మాతృశిశు ఆరోగ్యాన్ని మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ తనిఖీలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్ తదితరులు పాల్గొన్నారు.


Comments