రాష్ట్రవ్యాప్తంగా 25న వడ్డీ లేని రుణాల పంపిణీ భట్టి విక్రమార్క
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీని ఈ నెల 25వ తేదీన ఒకేసారి నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఘనమైన ఏర్పాట్లు చేయాలని,మంత్రులు–ఎమ్మెల్యేలకు ముందుగానే సమాచారం అందించి వారి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌కు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. మండల, గ్రామ సమాఖ్యల నాయకులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవాలని సూచించారు.గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకాన్ని పెద్ద ఎత్తున పునరుద్ధరించిందని భట్టి విక్రమార్క చెప్పారు. ఇప్పటివరకు రెండు–మూడు దశల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు పంపిణీ చేశామని, 25వ తేదీన మరో భారీ స్థాయి పంపిణీ జరగనుందని తెలిపారు.ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శ్రద్ధగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు. అధిక నాణ్యత గల చీరలను అందుకోవడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతి గ్రామానికి చీరల పంపిణీ విజయవంతం కావడాన్ని ఆయన అభినందించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్డిఓ సాంబశివరావు, హౌజింగ్ అధికారి పి. తిరుమణి మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Comments