విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు....
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
-విధులకు గైర్హాజరైన వైద్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
-పి.హెచ్.సి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డి.ఎం.హెచ్.ఓ. కు ఆదేశం
-రఘునాధపాలెం మండలం మంచుకొండ పి.హెచ్.సి. ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లాలని, అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం రఘునాధపాలెం మండలం మంచుకొండ పి.హెచ్.సి. ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంచుకొండ పి.హెచ్.సి. కు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకున్న కలెక్టర్ 15 మంది సిబ్బందికి గాను కేవలం ముగ్గురు ఉండటాన్ని గమనించారు. డ్యూటీ టైంలో ఇద్దరు డాక్టర్లు ఆస్పత్రిలో గైర్హాజరు కావడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి విధులలో ఉండాల్సిన డాక్టర్లు ఎక్కడ ఉన్నారంటూ కలెక్టర్ అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. వైద్యులతో చరవాణిలో మాట్లాడిన కలెక్టర్ పని చేయడం ఇష్టం లేకపోతే సెలవుపై వెళ్లాలని, అనవసరంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిని నమ్మి వచ్చే పేదల పరిస్థితి గురించి ఆలోచించక పోవడం విధుల పట్ల స్పష్టమైన నిర్లక్ష్య వైఖరి అని కలెక్టర్ అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీ.ఎం.హెచ్.ఓ. ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలలో డ్యూటీ పీరియడ్ లో వైద్యుల హాజరును డీఎంహెచ్ఓ నిరంతరం పర్యవేక్షించాలని, డ్యూటీ పీరియడ్ లో వైద్యులు తప్పని సరిగా ఆసుపత్రులలో అందుబాటులో ఉండాలని అన్నారు. ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ సేవలు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ల్యాబ్ పరీక్ష నమూనాల రిజిస్టర్లను, మందుల నిల్వలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వార్డులలో రోగుల వివరాలను అడిగారు. ఆసుపత్రిలో ప్రసూతి మహిళా సేవలను, వైద్య సేవలను మెరుగుపరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఎంత మంది ప్రసూతి మహిళలకు ఆరోగ్య బలమైన మందులు అందిస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలను పెంచుటకు గర్భిణులను ప్రోత్సహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించి వచ్చిన రోగులకు సాంత్వన కలిగించేలా వ్యవహిరించాలని, మంచి మాటలతో వైద్య సేవలు అందించి వారికి నమ్మకం కల్పించాలని వివరించారు. ఆసుపత్రి లోని పేషెంట్ లతో ఆరోగ్య వివరాలు, హాస్పిటల్ సిబ్బంది వ్యవహరించే తీరును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్ధానికంగా వచ్చే వ్యాధ్యుల పట్ల అవగాహన ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంగా వైద్యాధికారులు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments