సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి సరికాదు – మాజీ ఎంపీ నామ
సుప్రీం కోర్టు సీజేఐ పై దాడి పట్ల మాజీ ఎంపీ నామ ఖండన
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు;
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడి సంఘటనను బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థపై దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు సరికాదన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిపై దాడి ప్రయత్నం జరగడం ఆందోళనకరమని నామ అన్నారు. ప్రజల న్యాయహక్కులను కాపాడే న్యాయమూర్తులపై దాడి ప్రయత్నం దేశ ప్రజాస్వామ్య గౌరవాన్ని దెబ్బతీసిన చర్యగా అభివర్ణించారు. దాడి యత్నం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమూర్తుల భద్రతను మరింత పటిష్టపరిచి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టడంలో ప్రభుత్వం, న్యాయవర్గాలు, ప్రజాసంఘాలు సమన్వయంతో ముందుకు రావాలని నామ పేర్కొన్నారు.


Comments