సర్పంచ్ ఎన్నికలతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభం.!
- బిఆర్ఎస్ సర్పంచులకు ప్రజలు అండగా నిలిచారు.
- మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.
సత్తుపల్లి, డిసెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన గ్రామీణ ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి అఖండ మద్దతు తెలుపుతూ అపూర్వ విజయాన్ని అందించిన సత్తుపల్లి నియోజకవర్గ గ్రామీణ ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తమ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి వేధింపులు ఎదురైనా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అండగా నిలబడి పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించిన సండ్ర వెంకట వీరయ్య, రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి తప్పక ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ప్రతి గ్రామీణ ఓటర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పెట్టిన నమ్మకానికి తగినట్లుగానే బిఆర్ఎస్ పార్టీ సర్పంచుల పనితీరు ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీర మోహన్ రెడ్డి నివాసంలో నూతనంగా ఎన్నికైన బిఆర్ఎస్ సర్పంచులు, వార్డు సభ్యులతో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమావేశమై వారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments