మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం
అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి
హనుమకొండ, తెలంగాణ ముచ్చట్లు:
స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మహనీయుల జీవితం నేటి తరానికి ఆదర్శమని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దొడ్డి కొమురయ్య వర్దంతి సందర్భంగా నిర్వహించిన నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన తొలి అమరుడని, అతని త్యాగం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం గొప్ప ప్రేరణగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్, కార్పొరేటర్ మానస రాంప్రసాద్, బీసీ సంఘ నాయకులు ఏ. శ్రీనివాస్ యాదవ్, బి. శ్యామ్ యాదవ్, పి. రమేష్, బిక్షపతి, కె. ప్రకాష్, నరసింహులు, అంకయ్య, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments