కూల్చారు నిర్మాణం మరిచారు
వేలేరు, 26 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం అత్యవసరంగా చేపట్టాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. గతంలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రహరీ గోడను తొలగించినప్పటికీ, తిరిగి నిర్మాణానికి మాత్రం చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాల పరిసరాలు నిర్బంధం లేకుండా మారి, చదువుకునే విద్యార్థులకు ఆటంకాలు కలుగుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా, ఇదే పాఠశాల ఆవరణలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి వచ్చే ప్రజలు తమ వాహనాలను పాఠశాల ప్రాంగణంలోనే పార్క్ చేయడం విద్యార్థుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నట్టు గ్రామస్థులు పేర్కొన్నారు.
విద్యార్థుల భద్రత కోసమే కాదు, పాఠశాల వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి కూడా ప్రహరీ గోడ అత్యవసరమని గ్రామస్తులు చెప్పారు. వెంటనే స్పందించి ప్రహరీ గోడ నిర్మాణాన్ని ప్రారంభించి విద్యార్థులకు ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నట్లు తెలిపారు.


Comments