రాజీ మార్గమే రాజ మార్గం..
రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు...
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ టి. రాజగోపాల్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ టి. రాజగోపాల్ అన్నారు. బుధవారం జిల్లా కోర్ట్ లోని న్యాయ సేవాధికార సంస్థ హాల్లో ఈ నెల 14న చేపట్టబోయే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. రాజీ మార్గంలో కక్షిదారులు లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్ లు ఉపయోగ పడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయ సేవా సంస్థ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కేసులు రాజీ చేసుకోవడం ద్వారా అప్పీలు చేసుకోవడం ఉండదని, కోర్టు చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృధా అవుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
గత లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో 10712 కేసులు పరిష్కరించి, రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ కోర్టుల్లో 6277 కేసులు గుర్తించామని, ఇంకా కేసులు గుర్తించి, గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ నెల 14న వివిధ కోర్టుల్లో లోక్ అదాలత్ ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటుచేస్తామన్నారు.
క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు, ఇతర రాజీపడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసుల పరిష్కారంతో కక్షిదారుల మధ్య సుహృద్భావ వాతావరణం తో పాటు, గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెరేళ్ల శ్రీనివాసరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.


Comments