వీరనారి ఐలమ్మ 130వ జయంతి విగ్రహానికి పూలమాల
ఏ.ఎస్.రావు నగర్, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు వీరనారి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆమె విగ్రహం వద్ద సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ విగ్రహానికి సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ, కృష్ణమాచార్యులు, గొడుగు యాదగిరిరావు, జయరాజు, నవతెలంగాణ రవి, సీనియర్ పాత్రికేయులు గుమ్మడి హరిప్రసాద్, ఎం.భాస్కర్ రావు, శారద తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ – “వీరనారి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమానికి నిప్పురవ్వను వెలిగించిన గొప్ప యోధురాలు. నిజాం సర్కారు పాలనలో దేశముఖ్ దౌర్జన్యాలకు ఎదిరించి తన భూమి, పంటను కాపాడుకోవడం గొప్ప పోరాటం. ఆమెకు కమ్యూనిస్టు నాయకులు బీమి రెడ్డి నరసింహారెడ్డి సాయుధ సహకారం అందించడంతో దేశముఖ్ గుండాలను తిప్పికొట్టగలిగారు. దొడ్డి కొమరయ్య బలిదానం, ఐలమ్మ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రాణం పోశాయి” అని అన్నారు.అలాగే, ఈ పోరాట పటిమ వల్లే వేలాది ఎకరాలు రైతులకు దక్కాయని, వెట్టిచాకిరి నిర్మూలన జరిగిందని, తెలుగువారిని ఐక్యపరిచి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదపడిందని గుర్తు చేశారు.తరువాత హాజరైన సభ్యులందరూ ఐలమ్మ విగ్రహానికి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. “వీరనారి ఐలమ్మకి జోహార్” నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో జయరాజ్, కృష్ణమాచార్యులు, గుమ్మడి హరిప్రసాద్, నవతెలంగాణ రవి, ఎం.భాస్కర్ రావు, శారద, వర్మ, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments