షాహి కార్మికుల 12 రోజుల సమ్మెకు విజయం
8 ప్రధాన డిమాండ్లకు యాజమాన్యం అంగీకారం
నాచారం, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని షాహి గార్మెంట్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు జీతాల పెంపు, వేధింపుల నివారణ, బోనస్‌తో పాటు హక్కుల పరిరక్షణ కోరుతూ చేపట్టిన 12 రోజుల సమ్మె విజయవంతంగా ముగిసింది. ఈ సమ్మెకు సీఐటీయూ జిల్లా నాయకత్వం సంపూర్ణ మద్దతు తెలిపి, కార్మికుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించింది.సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు షాహి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. సీఐటీయూ నాయకత్వం జోక్యంతో యాజమాన్యాన్ని జాయింట్ లేబర్ కమిషనర్ (జెఎల్‌సీ) వద్ద చర్చలకు రావడానికి ఒప్పించారు. మొదటి రోజు చర్చలు విఫలమైన అనంతరం, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. తదుపరి స్థానిక జెఎల్‌సీతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి డిసెంబర్ 19న జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సాగిన దీర్ఘ చర్చల్లో కార్మికులు చేసిన 12 డిమాండ్లలో 8 డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించింది.యాజమాన్యం అంగీకరించిన ప్రధాన డిమాండ్లలో ప్రతి కార్మికుడికి వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వడం, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి వేతనాల పెంపు, ఒక్కొక్కరికి రూ.900 రిటైర్మెంట్ బోనస్ చెల్లింపు, 20 శాతం బోనస్, ఉద్యోగ భద్రత కల్పించడం, వర్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు, కార్మికులపై వేధింపులు జరగకుండా చర్యలు, రోజుకు రూ.800 వరకు జరుగుతున్న కట్‌ను నిలిపివేయడం, ‘నో వర్క్ – నో పే’ అంశంపై పునర్విచారణ ఉన్నాయి.
ఈ అన్ని అంశాలను జాయింట్ లేబర్ కమిషనర్ నేతృత్వంలో యాజమాన్యం, కార్మికుల సమక్షంలో రాతపూర్వక ఒప్పందంగా కుదుర్చుకున్నారు. మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు హై లెవల్ కమిటీ 15 రోజుల్లో కంపెనీని సందర్శిస్తుందని యాజమాన్యం హామీ ఇచ్చింది. పెరిగిన వేతనాలు, ఇతర ప్రయోజనాలు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు.ఈ ఒప్పందాన్ని మెజారిటీ కార్మికులు ఆమోదించడంతో పాటు, మిగిలిన కార్మికులకు వివరించడంతో అందరూ తిరిగి విధుల్లో చేరారు. కార్మికులు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ చర్చల సారాంశాన్ని కార్మికులకు వివరించేందుకు పి. గణేష్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో సీఐటీయూ నాయకులు కోమటి రవి, ఎస్. రమా, రమేష్, శ్రీకాంత్, అశోక్, జి. శ్రీనివాసులు, వెంకన్న, టీయూసీఐ నాయకులు ప్రదీప్ రమేష్, సీపీఐ సత్యప్రసాద్, పీవోడబ్ల్యూ ఝాన్సీ, షాహి కార్మిక నాయకులు శాలిని, శ్యామల, వనిత, పూజ, దేవి, రింకు సింగ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.ఈ పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానికులు, విలేకరులు, మీడియా మిత్రులు, పోలీసులు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ తదితర పార్టీలకు సీఐటీయూ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments