సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ‘విద్యారత్న అవార్డు–2025’
సత్తుపల్లి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
బి.గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి ‘భారత ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2025’లో విద్యారత్న అవార్డు–2025ను అందుకున్నారు. పరిశోధన, బోధన మరియు విద్యా సేవలలో 25 సంవత్సరాలుగా చూపుతున్న అంకితభావం, సమాజ పట్ల కట్టుబాటు, విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ టీ–హబ్‌లో అక్టోబర్ 25న జరిగిన ఈ కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నాస్కామ్, బ్రెయిన్ ఓ విజన్ ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రెయిన్ ఓ విజన్ సీఈఓ గణేష్ నాగ్ దొడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 3 వేల నామినేషన్లు అందగా, ఆన్‌లైన్ ఓటింగ్‌లో 2.9 లక్షల మంది పాల్గొన్నారని, 12 విభాగాల్లో 250 మందికి అవార్డులు అందజేశామని తెలిపారు.
డాక్టర్ శేషారత్నకుమారి విద్యారంగంలో అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేసినందుకు ఈ అవార్డు లభించినట్లు తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, హెటిరో ఫార్మాస్యూటికల్ సంస్థ అధినేత మరియు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్ రియాలిటీ సిస్టమ్ (విఆర్ఎస్) ద్వారా శేషారత్నకుమారిని అభినందించారు.
కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కూడా ఇదే సంస్థ నిర్వహించిన అవార్డుల్లో డాక్టర్ శేషారత్నకుమారి, ద్రోణాచార్య, ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్నారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పాముల శేఖర్ బాబు, ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ డియన్ వి.కృష్ణారెడ్డి, ట్రిపుల్ ఈ విభాగాధిపతి కోట రామకృష్ణ ప్రసాద్, సైన్స్ & హ్యూమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ షేక్ మీరాసాహెబ్, ఏఐ & ఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ తోటకూర వీరన్న, మెకానికల్ విభాగాధిపతి ఇంజనీర్ వి. వెంకటరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి విజయంపై కళాశాల బోధన సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినీలు హర్షం వ్యక్తం చేశారు.


Comments