బతుకమ్మ పేర్చిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
నియోజకవర్గ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
హన్మకొండ,సెప్టెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ, కనకదుర్గ కాలనీలోని తన నివాసంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని స్వయంగా బతుకమ్మ పేర్చారు. కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను పేర్చుతూ సాంప్రదాయ గీతాలు పాడి, పండుగను ఘనంగా జరుపుకున్నారు
.ఈ సందర్భంగా ఎంపి కావ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. పూలతో నింపిన బతుకమ్మ మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలో ప్రకృతి సౌందర్యం ప్రతిఫలిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పండుగ కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ అక్కాచెల్లెళ్ల బంధాలను బలపరుస్తుందని చెప్పారు.
బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతి పట్ల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఎంపీ పేర్కొన్నారు. సామాజిక ఐక్యత, సౌభ్రాతృత్వానికి ఈ పండుగ వేదికవుతుందని తెలిపారు. ప్రతి ఇంటిలో బతుకమ్మ ఆనందంగా జరగాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
అలాగే, బతుకమ్మ ద్వారా తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి భవిష్యత్ తరాలకు చేరేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పండుగల ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం మరింతగా పెరుగుతుందని ఆమె అన్నారు.


Comments