అమెరికాలో వేమన శతకం బోధన... మాతృభాషకు ప్రాధాన్యం.
సత్తుపల్లి, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
డల్లాస్ (అమెరికా): విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు మాతృభాషా బోధనలో భాగంగా వేమన శతక పద్యాలను కూడా నేర్పుతున్నారు. సత్తుపల్లి పట్టణానికి చెందిన అయ్యదేవర శేషగిరిరావు, మాదిరాజు మాలతి దంపతులు సోమవారం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ పట్టణంలో గల కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో సృజన సాహితీ సమాఖ్య పంపిన వేమన శతక పుస్తకాలను అందజేశారు.
శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్థాపించిన ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం “బాలదత్త” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో బాల రామాయణం, బాల భారతం వంటి పురాణ కథలతోపాటు మాతృభాష బోధన కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృభాషా పఠనానికి ఉపయోగించే వేమన శతకం తోపాటు బాల సాహితీవేత్త ఉరిమళ్ల సునంద రచించిన తెలుగు వాచక పుస్తకాలను స్వచ్ఛంద శిక్షకులు దీప్తి, శరణ్యలకు శేషగిరి దంపతులు అందజేశారు.
విద్యార్థులకు మాతృభాషా బోధనలో ఈ పుస్తకాలను ఈ సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుస్తకాలను పంపిన సృజన సాహితీ సమాఖ్యకు, రచయిత ఉరిమళ్ల సునందకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సాయి ప్రకాష్, కౌశిక్ మరియు తెలుగు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.


Comments