అంగన్వాడీ సెంటర్ల బలోపేతానికి కేంద్రం ఏం చర్యలు చేపడుతోంది..?
కనీసం 80 శాతం మరియు 20శాతం లోపు పని దినాలు నిర్వర్తించిన కేంద్రాలు ఎన్ని ఉన్నాయి..?
* లోక్ సభలో కోరిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
అంగన్ వాడీ సెంటర్ల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతోందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. శుక్రవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కనీసం 80 శాతం ఆ తర్వాత 20 శాతం లోపు పనిదినాలు నిర్వర్తించిన కేంద్రాలు, అలాగే.. అప్ గ్రేడ్ పురోగతి, నిధుల వివరాలు తెలపాల్సిందిగా కోరారు. దీనికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
పోషణ్ ట్రాకర్ డేటా ప్రకారం..2024 నుంచి ఈ ఏడాది జూన్ నాటికి కనీసం 80 శాతం పని దినాలు నిర్వర్తించిన సెంటర్లు దేశవ్యాప్తంగా.. 11,88,217 ఉండగా ఇందులో తెలంగాణవి 32,551 ఉన్నాయని, 20 శాతం లోపు తెరిచిన సెంటర్లు దేశవ్యాప్తంగా 29,830 ఉండగా.. తెలంగాణవి 386 కలవని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.
మొత్తం 12,71,520 సెంటర్లకు తాగునీటి సౌకర్యం కలదని, మరుగు దొడ్డి సౌకర్యం ఉన్న కేంద్రాలు 10,60,429, వంట షెడ్డు కలిగినవి 9,32,777 సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక అప్ గ్రేడ్ కు సంబంధించి..2లక్షల సెంటర్లు ఎంపికయ్యాయని, ఇందులో తెలంగాణకు సంబంధించి 5,008 ఉన్నాయని, కేంద్రం రూ.30 కోట్లు కేటాయించగా... రూ. 2.7 కోట్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి వివరించారు.


Comments