జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కేంద్రం జీఎస్టీ భారం తగ్గిస్తుందా..?
* ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారా..?
* పార్లమెంట్ లో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
జీవిత, ఆరోగ్య బీమాల ప్రీమియంలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) భారం తగ్గిస్తారా..? పన్నుల రూపంలో లాభాపేక్ష లేకుండా, వినియోగదారుల పక్షాన ప్రత్యేక ప్రణాళికను ఏమైనా రూపొందిస్తారా..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా.. సోమవారం ఈ మేరకు కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రాలు, కేంద్రం నుంచి ప్రతినిధులతో కూడిన కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా జీఎస్టీ రేట్లు, మినహాయింపులు నిర్దేశించబడినట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ సమస్యపై సవివరమైన చర్చల తర్వాత.. కౌన్సిల్ సిఫారసు మేరకు సమగ్ర పరిశీలనకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీఓఎం తమ నివేదికను జీఎస్టీ కౌన్సిల్ కు ఇంకా సమర్పించలేదని అన్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత..ఆరోగ్య బీమా పాలసీలకు పన్ను ప్రయోజనాలపై స్పష్టత వస్తుందని ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి వివరించారు.


Comments